Tuesday, February 9, 2016

వాంగ్మూలం -బమ్మిడి జగదీశ్వరరావు

రమా సుందరి added 3 new photos to the album: చక్రాల కుర్చీ యిచ్చిన వాంగ్మూలం... బజరా కలం నుండి ఈ నెల మాతృకలో.
వాంగ్మూలం
-బమ్మిడి జగదీశ్వరరావు
తను నన్ను ఖాళీ చేసాక నా నిండా శూన్యమే! తనుంటేనే నేను! తను లేక నేను లేను! నా వునికి లేదు! వుపయోగం లేదు! నాకంటూ వేరే కథ లేదు! తన కథ చుట్టూనే నా కథ! తన కథే నాకథ! తన వ్యధే నా వధ!
ద్వారాలు కూడా లేని అడ్డగించని యింట్లో స్వేచ్ఛగా తిరుగాడిన దాన్ని! గది గదికీ గిర్రున తిరిగిన దాన్ని! రీడింగ్ రూమ్ లోంచి హాల్లోకి.. హాల్లోంచి వంటగదిలోకి వొచ్చి వాలిన దాన్ని! బెడ్ రూమయినా బాత్ రూమయినా తోడుగా పరిగెత్తిన దాన్ని! గుమ్మంలోకి వొచ్చి సాగనంపిన దాన్ని! తిరిగి వొచ్చేవరకూ వేయికళ్లతో వేచి చూసిన దాన్ని! తోడుగా యెక్కడికయినా వెళ్ళిన దాన్ని! గల్లీలో జరిగిన మీటింగయినా.. ఢిల్లీ యూనివర్సిటీ తరగతి గదయినా.. ఆందోళనలు పట్టిన ఆదివాసీలతో గొంతు కలిపినప్పుడయినా.. చట్టాన్ని అమలు చెయ్యమని చదువుకున్న పిల్లలతో నడిచినప్పుడయినా.. యెప్పుడయినా యెక్కడయినా తనతోనే నేను..
పదమూడేళ్ళ క్రితం యీ యింట్లో అడుగుపెట్టాను! యింట్లో మనిషినయాను! దాదాపు యాభై యేళ్ళు వచ్చినా తనని మోసిన దాన్ని! యెత్తుకు తిరిగినదాన్ని! అమ్మని! ఆలిని! అమ్మాయిని! అన్నదమ్మున్ని! విద్యార్థిని! అంతకుమించి తన శరీరంలో భాగాన్ని!
ఎవరో తననుండి నన్ను వేరు చేసారు! తనని యెత్తుకుపోయారు! బంధించారు! సంకెళ్ళు వేశారు! చెట్టాపట్టాల్ వేసుకు తిరిగిన నేను మూలన పడిపోయాను! దుమ్ముతో దూళితో కమ్ముకుపోయాను! నేనిప్పుడు జీవచ్ఛవాన్ని!
నాకు నోరు లేకపోవచ్చు.. నాకు మాట రాకపోవచ్చు.. నేను యినుమునే కావచ్చు.. కానీ నిజమైన మనిషితో తిరిగాక మనిషితనం అంటకుండా వుంటుందా? ఆరాటం లేకుండా వుంటుందా? కొందరు మనుషులు మరలైనప్పుడు.. మరలు మనుషులు కాకూడదా? ఈ చక్రాల కుర్చీకి ఆలోచనలు గిర గిరా తిరగకూడదా?
ఔను! మంజీరా నదే! నాన్న వున్నప్పుడు నట్టింట్లో నదిలానే ప్రవహించేది! నదినెవరో కొల్లగొట్టారు! నాన్న నిమిరినప్పుడు.. ముద్దాడినప్పుడు.. కథలు చదివించినప్పుడు.. దేశ దేశాల బాధల గాధలు పంచుకున్నప్పుడు.. పలవరించి పరవశించినప్పుడు.. మంజీరా జీవనదే! మంజీరా గీసిన గీతలు రూపం ధరించిన బొమ్మలయ్యేవి! కుంచె తీసి రంగులు చల్లితే - పక్షులు గింజలు యేరుకున్నట్టు బొమ్మలు రంగులు యేరుకొనేవి! తామే అద్దుకొనేవి! జీవం పోసుకోనేవి! వేటాడని పచ్చదనాల సహజ అరణ్యం కానుకగా గీసి యిస్తే నాన్న యెంత మురిసిపోయాడని?! నాన్న అలికిడి లేక మంజీరా అప్పుడప్పుడూ లోలోపల గడ్డకట్టుకు పోతోందా..? నాన్న వస్తారన్న నమ్మకంతో తిరిగి కరిగి ప్రవహిస్తోందా..?
ఇంటికొచ్చిన యెవరో అడిగితే మంజీరా యేమంది? “అందరి నాన్నల్లానే తను నాకు నాన్నఅంతే. స్పెషల్ కాదు! ఎవరి నాన్న వారికే స్పెషల్! మీ అందరిలానే తొందరగా నాన్న రిలీజ్ కావాలనుకుంటున్నా.. నాన్న చేసింది మంచి పని అని నాకు తెలుసు, నా ఫ్రెండ్స్ కూ తెలుసు, వాళ్ళు యెప్పటిలానే నాతో స్నేహంగా ప్రేమగా వున్నారు” మంజీరా మామూలుగా చెప్పేసింది! పద్దెనిమిదేళ్ళ పిల్ల, యెంత అర్థం చేసుకుందీ?!
‘నాన్న అరెస్టు కావడం.. బాధ పడ్డావా?.. యెలా ఫీలయ్యావ్?’ అడిగిన వాళ్ళ గొంతులో అడగలేనంత బాధ! “ఇంటిని పోలీసులు సెర్చ్ చేసినప్పుడూ.. ఆఫీసుకు వెళ్ళిన నాన్న యింటికి రారని తెలిసినప్పుడూ.. మళ్ళీ యింటిమీద పడి రైడ్ చేసి యేవేవో యెత్తుకు పోయినప్పుడూ.. ప్రతీది పరీక్షల టైంలోనే జరిగింది! అప్పుడు పెర్సెంటేజ్ తగ్గింది! యిప్పుడు అలవాటు పడ్డా, నా యింగ్లీష్ లిటరేచర్లో నేనే ఫస్ట్ కాకపోయినా బెస్ట్.. నాన్న యింటికి రావడం నే ఆశపడితే అయ్యేది కాదు కదా?!..” నిజమే.. తండ్రికి తగ్గ కూతురే!
దారులు మూసేకొద్దీ చాలా దారులు మా యింటికి దారి కట్టాయి! వచ్చీపోయే వాళ్ళు పెరిగారు! యూనివర్సిటీ విద్యార్థులూ ప్రొఫెసర్లూ స్టేఫూ.. దేశంలోని సామాజిక కార్యకర్తలూ ప్రజాసంఘాలవాళ్ళూ రచయితలూ వస్తున్నారు.. వెళుతున్నారు.. కుటుంబానికి ధైర్యమివ్వడం పాత మాట! ‘ఫ్రీ సాయిబాబా’ నిత్య పోరాటం కొత్త బాట! అరుంధతీ రాయ్ మాట్లాడింది మీకు తెలుసు.. మరి అమ్మ కళ్ళ ముందు యేo కదిలింది?
“మాది సన్నవిల్లి. అమలాపురానికి యెనిమిది కిలోమీటర్లు. అయిదేళ్ళ వరకూ సాయి అందరిపిల్లల్లానే నడవడమేమిటి పరిగెత్తేవాడు. వొక రోజు జ్వరం వొచ్చి పడిపోయాడు. లేవలేదు. ఆరెమ్పీ డాక్టరు యింజక్షను యిచ్చాడు. విసాకపట్నం తీసికెలిపోమన్నాడు. అప్పుడు పుస్కరాలు. నిండు గోదావరి. వరదలు. తీసికెల్లడం కస్టమయింది. అస్టకస్టాలు పడ్డాం. పడవేసుకెల్లాం. బస్సు పట్టుకున్నాం. పిల్లడ్ని డాక్టరు చేతిలో పెట్టాం. పొజిషన్ డేంజరుగుంది అన్నాడు. బతికితే అద్రుష్టవంతులే నన్నాడు. బతికేతే కాళ్ళు తెప్పించేస్తానన్నాడు. బతకనిది డాక్టరు వ్యాగ్రేశ్వరుడు! నెలరోజులున్నాం. అక్కడే వంట చేసుకుతిన్నాం. నల్లులు కుడితే కాళ్ళు కదిపాడు. ఎన్ను ముదరాలని ఏడవతరగతికి వొచ్చేక వొకటికాదు నాలుగు ఆపరేసన్లు చేసారు. అమలాపురం లోనే. అమెరికను ఆసుపెట్లులోనే. ధర్మారావు డాక్టరు లేడా.. అతగాడు సిమెంటు కట్లు మొల నుండి కాలివేలి దాక మొత్తమేసాడు. కాళ్ళు పుల్లల్లాగ అయిపోయాయి! తమ్ముడు రాందేవ్ తెలుసును కదా.. తనే అన్నని సైకిలు మీద తిప్పేవోడు. సెంటు జోసెఫ్ స్కూలు. మంచం మీద వుండే మంచి మార్కులతోటి పాసయ్యాడు. డిస్ట్రిక్ట్ ఫస్ట్ వొచ్చాడు. ఎస్కేబీఆర్ లో యింటరు, బియ్యే ఆనర్స్, ఎమ్మే ఎంట్రన్స్ లో టాపు రేంకు తెచ్చుకున్నాడు. ఏ పని చేసినా మంచిగా శ్రద్దగా చేసేవోడు. కొబ్బరి తోటలో మా యిల్లు. దీపాల దగ్గరే చదువుకొనేవాడు. దీపాలకి జెర్రెలు వొచ్చేవి. గింజలు నాటేవోడు. తోటని అడవి చేసేవోడు. మామిడి పనస కూడా పెంచేవోడు. సాయి వాళ్ళ నాన్న మూడు యెకరాల ఆస్తి నాలుగు వేలకు రాసిచ్చాడు. తుంగబధ్ర దగ్గిర కొన్నిది తుంగబద్రలోనే కలిసిపోయింది..” గుక్క తిప్పుకోకుండా గుర్తుకొచ్చినవన్నీ చెప్పుకుపోతూవుంది. అడిగినాయన సెల్లు మోగింది. అమ్మ చెప్పడం ఆపింది.
నేను అప్పుడప్పుడూ విన్న కథే! మళ్ళీ మొదలయింది..
“స్కాలరుసిప్పుల మీదే నా పిల్లలు చదువుకున్నారు. వాళ్ళ కస్టo మీదే వాళ్ళు చదువుకోడమే కాదు, యిల్లు కూడా చూసుకున్నారు. సాయి ట్యూషన్లు చెప్పేవోడు. ఫీజు అందరి దగ్గరా తీసుకొనేవోడు కాదు. వేరే ప్లేటులో బయిటి వాళ్ళని తిననిచ్చేవోడు కాదు, వాళ్లకి పెట్టినదాంట్లో తను తినేవోడు. అప్పట్లో రేడియో కొనుక్కోవాలని పేద్ద కోరిక. పదీ పావలా కూడబెట్టి నూటా యాభై రూపాయలు చేసారు అన్నదమ్ములిద్దరూ. సుధా సూర్యనారాయణమూర్తి అని రేడియోలు అమ్మినాయన చేతిలో చిల్లరంతా పోశారు. చిల్లర చూస్తే అందులో పిల్లల పట్టుదల కనిపించింది అతనికి! పిల్లల ఆశ అర్థమయింది. డబ్బులు వద్దు అన్నాడు. రేడియో తీసుకెల్లమన్నాడు. వద్దన్నాడు సాయి. డబ్బు తీసుకోకపోతే రేడియో వద్దే వద్దని యింటికి వచ్చేసాడు. స్కూలు నుండి వొచ్చేసరికి యింట్లో రేడియో పాడుతోంది. వొప్పుకోలేదు. రేడియోని తిప్పి కొట్టుకు పంపాడు. నూటయాభై రూపాయలు తీసుకున్నాకే రేడియో తీసుకున్నాడు. ఆతరువాత వాళ్ళ నాన్న ఆ రేడియోని వంద రూపాయలకు అమ్మేశాడు, అది వేరే కథ..” ఆ కథ ముఖ్యం కాదనుకుంది అమ్మ సూర్యావతమ్మ.
అమ్మ అందరి అమ్మల్లా యేడవలేదు, వొచ్చిన వాళ్ళకి వడ్డిస్తూ అంది.. “నాకు హిందీ రాదు, వొస్తే- ‘ఒరే మోడీ.. నా కొడుకు గోకరకొండ నాగ సాయిబాబా చేసిన తప్పేమిటి?’ అని అడగాలనుంది..” అంది.
“తప్పే.. ఢిల్లీ యూనివర్సిటీలో రిజర్వేషన్లు అమలు చెయ్యకపోవడం తప్పే.. ఆ తప్పుని యెత్తి చూపించడమూ తప్పే! ప్రొటెస్టు చేయడం తప్పే! యూజీసీకి కంప్లైంట్ చెయ్యడమూ తప్పే! ఫలితంగా రిజిస్ట్రార్ని పిలిపించి రీకాల్ చేయడంతో అవమానం ఫీలయిపోయారు. రిజర్వేషన్లు అమలు చేయాల్సి రావడంతో అన్యాయం ఫీలయిపోయారు. యూనివర్సిటీ అధికార వర్గాలకి టార్గెట్ అయ్యాడు. మరోవేపు గ్రీన్ హంట్ కు వ్యతిరేకంగా పోరాడడంవల్ల కార్పొరేట్ వ్యాపారులు వెనక్కి వెళ్ళిపోవడంతో ప్రభుత్వం కక్షగట్టింది..” అలుపెరగని పోరులో అలవాటుగా సహచరి వసంత చెప్పుకుపోతోంది! భర్తని విడిపించుకోవడం కోసం.. న్యాయసహాయం కోసం.. నలుగురితో ఫోనుల్లో మాట్లాడుతోంది. పాతికేళ్ళ వాళ్ళ ప్రయాణంలో యెన్నో యెత్తు పల్లాలు చూసింది!
ఎవరో రచయిత మరీ సున్నితంగా వున్నాడేమో నన్ను పట్టుకు తడిమాడు. అతని స్పర్శకి నా వొళ్ళు జలదరించింది. ‘ఢిల్లీలో చలెక్కువ కదా?’ అని అటు మాట్లాడుతూ యిటు నా మీద దుప్పటి కప్పాడు! సాయి వొదిలిన చెప్పుల్ని కళ్ళతో తడుముతున్నాడు!
మూలనపడి నిర్జీవంగా వున్న నాకు జీవమొచ్చినట్టయింది!
గతించిన కాలాన్ని వసంత వరుసగా పేర్చడం లేదు. ఉరుకుల పరుగుల్లో జ్ఞాపకాలుగా వెతుక్కుంటోంది. తవ్వి తలపోస్తోంది. హైస్కూల్ కాలం నుండి సాయితో తన స్నేహం.. సాహిత్యమే అందుకు వారధి కావడం.. సాహిత్యమే రాజకీయాల వైపు మళ్లించడం.. తమ పెళ్ళయి అప్పుడే పాతికేళ్ళు కావడమూ..
‘పాతికేళ్ళ మీ కథని మీరే రాస్తే బావుంటుంది..’ అనంటే “రాయాలనే వుంది.. రాయగలనా?” అంది. “రాస్తానేమో తెలీదు” అని కూడా అంది. “ఎక్కడ మొదలు పెట్టాలో తెలీదు” మళ్ళీ తనే అంది. అంతలోనే- “సాయి చాలా బుక్స్ రాయాలని మెటీరియల్ తయారుచేసుకున్నాడు. ప్లాన్ చేసి, స్టోర్ చేసి పెట్టుకున్నాడు. ఒక యేడు రెండు యేళ్ళు కావు, పదిహేను సంవత్సరాలుగా దాచుకున్నవి హార్డ్ డిస్క్, లాప్ టాప్, పెన్ డ్రైవ్లు.. అన్నీ కాపీ చేసుకు యిచ్చేస్తామని తీసుకు వెళ్ళారు, నేను నమ్మేసాను, దేన్నీ నమ్మని నేను యెలా నమ్మానో నాకే తెలీదు..” నొచ్చుకుంది వసంత.
యూనివర్సిటీ పిల్లలొచ్చారు. చెయ్యబోయే కార్యక్రమాన్ని మాట్లాడుకుంటున్నారు. ఎవరెవరికో యిన్ఫాం చేస్తున్నారు. మెయిల్లు పెడుతూ వసంత చెపుతోంది..
“మహారాష్ట్ర గచ్చిరోలి డిస్ట్రిక్ట్ ఆహేరి పొలీస్టేషన్ పరిధిలో దొంగతనం జరిగింది. అక్కడ దొంగలించిన సామాన్లు యిక్కడ మాయింట్లో వున్నాయని సెర్చ్ వారెంటుతో వొచ్చారు..” గవర్నమెంటు హీనబుద్దికి నవ్వుతోంది వసంత. “పాపం.. వాళ్ళు మాత్రం యింకేమని కేసు పెట్టగలరు లెండి..” అంతలోనే జాలిపడుతోంది.
నేనే కాదు అప్పటిదాకా వింటున్న వాళ్ళంతా మూగవాల్లయిపోయారు!
“అప్పుడూ యిప్పుడూ యెప్పుడూ యిల్లే ప్రాబ్లం.. హైదరాబాద్లో వున్నప్పుడు కూడా. ఏ వొక్క యింట్లో వొక్క యేడాది వున్నది లేదు. పోలీసులు యింటి ఓనర్లను వేదించి మరీ మమ్మల్ని ఖాళీ చేయించారు..” చెప్తూ చెప్తూ వసంత ఢిల్లీ వొచ్చిన రోజుల్ని గుర్తు చేసుకుంది. “ఏఐపిఆర్ఎఫ్ సెక్రెటరీగా ఢిల్లీలో వుండాలని అనుకుంటే- ఫ్యామిలీ లేదని యింటి ఓనర్ గొడవ చేస్తే.. అప్పుడు నాకు యెనిమిదో నెల. మంజీరా కడుపులో వుంది. అప్పుడే యిక్కడకు రావాల్సి వొచ్చింది. యిప్పుడు ఫ్యామిలీ వున్నా పిల్లలున్నా యిల్లూ లేదు.. యింట్లో మనిషీ లేడు..” వసంత నిష్టుర పడలేదు. సత్యాన్ని స్వీకరించి జీర్ణించుకున్నట్టే వుంది. ఇందిరాపురంలో లోను పెట్టి కొన్న యిల్లు, పీతంపురంలో అద్దె యిల్లు, ఢిల్లీ యూనివర్సిటీ ఫ్లాటు.. గ్వాయర్ హాల్ యూనివర్సిటీలో వుందే అదీ.. చెప్పుకుపోతోంది..
పిల్లి పిల్లల్ని తిప్పినట్టు యిల్లిల్లూ తిప్పుతూ తిరుగుతూ వుండడం నాకు గుర్తుంది! ఈ యింటికి రావడానికి ముందు యెన్ని అవస్థలు పడ్డారని? ముందటి వీసీ యే వార్డెనూ వుండని యిల్లు ఎలాట్ చేసారు.. నేను తిరగడం కోసం ద్వారాలు తీసి రిపేర్లు చేసారు.
“ఇంటలిజెన్సు వాళ్ళు యిల్లే కాదు, వుద్యోగమే తీసేయమని వీసీని వొత్తిడి చేసారు. రిపేర్ల ఖర్చుని డామేజ్ అన్నారు. డామేజీ చార్జీలు అరవై వేలు కట్టమన్నారు. సేలరీలో కట్ చేసారు. ఇల్లు ఖాళీ చేసేదాకా తాఖీదుల మీద తాఖీదులు యిచ్చారు. జాబూ సస్పెండ్ చేసారు. మొదటి ఆరు నెలలు ఫిఫ్టీ పర్సెంట్ యిచ్చి తరువాత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ యివ్వాలి, కాని ఫిఫ్టీ పర్సెంట్ సేలరీయే యిస్తున్నారు. సర్వైవల్ ప్రాబ్లం చెయ్యాలని చూస్తున్నారు. ఇప్పుడున్న ఈ యిల్లు గిరిజా ఈశ్వరన్ ఐఏయస్ రిటైర్డ్ దంపతులది. వాళ్ళు పేపర్లో చదివి ఢిల్లీ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంటు నందితా నారాయణ్ ను పిలిపించి మాట్లాడి కుటుంబం రోడ్డున పడకుండా తక్కువ అద్దెకే యిల్లు యిచ్చారు, వాళ్ళ పిల్లల్ని వొప్పించి మరీ..” వసంత గొంతులో కృతజ్ఞత!
ఈ యిల్లు చల్లంగుండాలి!
నాగపూర్ అండా సెల్లో చెయ్యని నేరానికి సాయి ఒక్కడే శిక్ష అనుభవిస్తున్నాడా? ఇంటిల్లిపాదీ కనపడని శిక్షలు అనుభవించడం లేదూ?
“మా నీడతో కూడా మా మీద నిఘా పెట్టించారు! పనిమనిషి ఒరిస్సా నుండి తెచ్చిన ఆదివాసీ. తనని భయపెట్టి లోభరచుకున్నారు. సెల్ ఫోన్లో యెప్పటికప్పుడు ఆమె యింట్లో సమాచారం చేరవేసేది. ఆమెకు ఫోన్లు వస్తే మాట్లాడి డిలిట్ చేసేది. మొదట్లో డిలిట్ చెయ్యడం వొచ్చేది కాదు, తరువాత నేర్చుకుంది. తలుపు చాటున వినేది. ఎవరెవరు యింటికి వొస్తున్నారో చెప్పేది. ఓసారి ఫోన్ లాక్కొని ఎంక్వయిరీ చేసాను. పోలీస్ డిపార్టుమెంటుదే! డ్రైవర్ ఢిల్లీ ఆయన్నే పెట్టుకున్నాం. తననీ లోభరచుకున్నారు. తెలిసాక మానేసాడు. మరొకతను డ్యూటీ చెయ్యలేక భయపడి పారిపోయాడు. సాయిని చెప్పకుండా అరెస్టు చేసే సమయంలో మరో డ్రైవర్ కుర్రాడి ఫోన్ లాక్కున్నారు. కళ్ళకు గంతలు కట్టి, పెడరెక్కలు విరిచి కట్టి గాడీ చేంజు చేసి మరీ పట్టుకుపోయాక యింకా యెవరైనా పని చెయ్యగలరా? చేస్తారా? ఇంటి ముందు మఫ్టీలో పోలీసులు తిరుగుతుంటే.. సెర్చ్ అనీ రైడ్ అని అరవైమంది పోలీసులు యింటిమీద పడుతుంటే.. ప్రతిక్షణం టెర్రరైజ్ చెయ్యాలని చూస్తూ పెడుతున్న హింస మానవ హక్కుల ఉల్లంఘన కాదా?” వసంత అలసిన స్వరం యింకా ఖంగుమంటోంది!
“మా ఫ్యామిలీకి యిన్ఫామ్ చెయ్యండి అని సాయి చెప్పాడు, వినలేదు.. మందులు తెచ్చుకోవాలి అని చెప్పినా అవకాశం యివ్వలేదు.. అరెస్టు కాదది. అఫీషియల్ కిడ్నాప్ అది..” స్టూడెంటు గొంతులో భరించలేని భాస్వరం లాంటి తీవ్రత!
కూలీలొస్తున్నారు. మాలీలు వొస్తున్నారు. దోబీలు వొస్తున్నారు. విద్యార్థులు వొస్తున్నారు. టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ వొస్తున్నారు. కవులొస్తున్నారు. కళాకారులొస్తున్నారు. ప్రజాసంఘాల వాళ్ళు వొస్తున్నారు. సామాజిక కార్యకర్తలు వొస్తున్నారు. మేథావులొస్తున్నారు.
ఒకటే నినాదం.. నిర్నిద్రగానం..
“ఫ్రీ సాయిబాబా”
రాజ్యం రంగూ రుచీ చిక్కదనం.. ఆరాజ్యంలో వుండే మనుషుల జీవితాలే కాదు, మర జీవితాలు కూడా చెపుతాయి! నాలాంటి చక్రాల కుర్చీ యిచ్చిన వాజ్మూలమే అందుకు సాక్ష్యం అవుతుంది!
(విక్టర్ విజయ్ కుమార్ గారికి కృతజ్ఞతలతో)

No comments:

Post a Comment